జన్నారం, (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాంటప్పుడే గుర్తింపు ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఇందనపెళ్లిలోని ఉప కేంద్రాన్ని బుధవారం మధ్యాహ్నం జాతీయ ఆరోగ్య మిషన్ పీఆర్సీటీ సభ్యులు డాక్టర్ రమణ, శ్రీనివాస్ సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను, వ్యాధుల గూర్చి తీసుకుంటున్న చర్యలు, ఉద్యోగులను,మందుల వివరాలను, రిజిస్టర్లను సక్రమ నిర్వర్తించడం వైద్య సిబ్బంది సమయపాలనను వారు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ…
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రోగుల కోసం రూ.లక్షల ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలాగా గర్భవతులకు సూచనలు చేయాలని ఆయన తెలిపారు.
డిజిటల్ మిషన్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందించాలని ఆయన సూచించారు.జాతీయ కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, పరీక్షలు చేయాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ పీఆర్సీటీ డాక్టర్లు ఇక్కడి వైద్య సేవల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి ఎల్. సుధాకర్ నాయక్, డీపీఓ ప్రశాంతి, సి.హెచ్.ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, స్థానిక ప్రభుత్వ డాక్టర్లు గోల్కొండ ఉమాశ్రీ, జాదవ్ లక్ష్మి, గ్రామీణ వైద్యురాలు గంగాదేవి, నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ మేనేజర్ రాజకుమార్, ఫార్మసిస్టు కృష్ణవేణి, స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, సూపర్వైజర్లు,ఆరోగ్య కార్యకర్తలు రాంబాబు, పోచయ్య,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.