మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది

  • దాన కిషోర్

చిట్యాల, ఆంధ్రప్రభ:
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు.

బుధవారం ఆయన చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జలశక్తి అభియాన్, జనసంచాయ్–జన్ భాగీదారి కార్యక్రమాలను పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి పనుల పురోగతి, వేతనాల చెల్లింపు, మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి పనులు చేస్తున్నామని, రోజుకు సుమారు రూ.300 వేతనం అందుతోందని మహిళా కూలీలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 16.20 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా, నల్గొండ జిల్లాలో 1.20 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. ఉపాధి కూలీల నమోదు విషయంలో రాష్ట్రంలో నల్గొండ జిల్లా ముందంజలో ఉందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ను అభినందించారు.

మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.870 కోట్లు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల నిర్వహణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

అన్ని గ్రామపంచాయతీ భవనాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నకాపర్తి చెరువును పరిశీలించి ఉపాధి పనుల్లో తీసిన మట్టిని రైతుల పొలాల్లో వేయడం ద్వారా భూమి సారవంతం అవుతుందని చెప్పారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామపంచాయతీ నిధులను వినియోగించాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నకాపర్తి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్రస్తుతం ఉన్న 800 కుటుంబాల్లో ఉపాధి కూలీల సంఖ్యను 500కు పెంచాలని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ నర్సరీలో ద్రాక్ష, కాకర, చింత, అశ్వగంధ, కరివేపాకు, నేరేడు, బాదం, మామిడి తదితర మొక్కలను పరిశీలించారు. గ్రామంలో రహదారులు, హెల్త్ సెంటర్, మహిళా సంఘాల భవనాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నకాపర్తి గ్రామంలో ఉపాధి పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో జిల్లాకు జాతీయ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు.

జలసంచాయ్–జన్ భాగీదారి కార్యక్రమంపై మే 11 నుంచి జూన్ 10 వరకు ఆరు నియోజకవర్గాల్లో ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ఏపీడీ నరసింహారావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, గ్రామ సర్పంచ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply