వ్యవసాయ మార్కెట్లో వైద్య సదుపాయం కల్పించండి

వ్యవసాయ మార్కెట్లో వైద్య సదుపాయం కల్పించండి

కేసముద్రం, ఆంధ్రప్రభ:
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక హోదా కార్యదర్శి అమరలింగేశ్వరరావును ఏఐసీటీయూ కార్మిక సంఘం నాయకులు గురువారం కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో పాటు వడగాల్పులు వీస్తున్నందున మార్కెట్‌కు వచ్చే కార్మికులు, రైతుల రక్షణ కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ ప్రాంగణంలో అందరికీ మజ్జిగ సరఫరా చేయాలని, అలాగే వర్షాలు వచ్చేంతవరకు మార్కెట్ ఆవరణలో ఒక డాక్టర్ అందుబాటులో ఉండేలా వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు రాత్రింబవళ్లు నిరంతరాయంగా తాగునీరు, క్లీనింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

కార్మికులు, రైతుల సమస్యలపై ఏఐసీటీయూ నాయకులు ఇచ్చిన వినతిపత్రంపై మార్కెట్ కమిటీ ప్రత్యేక హోదా కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాలను తాము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం దృష్టికి, అలాగే ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు గ్రేడర్ రాజా, సూపర్వైజర్ వివేక్, కార్మికులు రమణ, బోయిన సురేష్, గుగులోత్ చిన్నరాజు, బెజ్జం ఐలయ్య, కస్తూరి వెంకన్న, జినుగుల పుల్లయ్య, బానోతు రాజా తదితరులు పాల్గొన్నారు.