సింగరేణి ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేస్తాం

సింగరేణి ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేస్తాం
- టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వబోమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీజీబీకేఎస్) వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీబీకేఎస్ ఆవిర్భవించిందని ఆయన గుర్తుచేశారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలోని 8 ఇంక్లైన్ గనిలో మొదటి షిఫ్ట్ కార్మికులను ఆయన నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుండి సుమారు 51 వేల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని కెంగర్ల మల్లయ్య తెలిపారు. ఆ నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి కార్మికులకు నెలవారీ జీతాలు చెల్లించేందుకు కూడా బ్యాంకులపై ఆధారపడాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడిందన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
ఇతర కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల పరిరక్షణను పూర్తిగా విస్మరించాయని ఆయన విమర్శించారు. ఒకప్పుడు సింగరేణిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలైన వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మకుటాయమానమైన సింగరేణిని కాపాడుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యత అని పేర్కొన్నారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ విక్రయాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితి ఎంతగానో ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్మికుల హక్కుల సాధన, వారి కుటుంబాల సంక్షేమం కోసం టీజీబీకేఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రతినిధులు మండ సంపత్, ముస్కే లక్ష్మణ్, అనిల్ పాల్గొన్నారు. వీరితో పాటు రాకేశ్ రెడ్డి, కిషన్, సాంబయ్య తదితర కార్మిక నాయకులు హాజరయ్యారు.
