అక్రమ నగదు రవాణా పట్టివేత

అక్రమ నగదు రవాణా పట్టివేత

  • రూ.45.30 లక్షలు సీజ్

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ:
పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై సాగిన ఈ తనిఖీల్లో భారీగా తరలిస్తున్న అక్రమ నగదు పట్టుబడింది.

విజయవాడ నుండి చెన్నై వైపు వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును పోలీసులు ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బస్సు ప్రయాణికుడి వద్ద రూ.45,30,000 అక్రమ నగదు లభ్యమైంది. పోలీసులు ఆ సొమ్మును కలిగి ఉన్న నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్‌ను ఆధీనంలోకి తీసుకుని విచారించారు. తాను బంగారం కొనుగోలు చేయడం కోసమే ఈ భారీ నగదుతో చెన్నైకి వెళ్తున్నట్లు అతడు పోలీసులకు తెలిపాడు.

వ్యాపార నిమిత్తం తరలిస్తున్న సదరు నగదుకు సంబంధించి ఎలాంటి సరైన రశీదులు, పత్రాలు, తగిన ఆధారాలు అతడు చూపించలేకపోయాడు. దీంతో పోలీసులు ఆ రూ.45,30,000 నగదును తక్షణమే సీజ్ చేశారు. పట్టుబడిన సొమ్మును తదుపరి విచారణ నిమిత్తం విజయవాడ ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయపు పన్ను) శాఖ అధికారులకు అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా హవాలా, అక్రమ మార్గాల్లో ఎవరైనా నగదు రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రహదారులపై ఎక్కడైనా అనుమానాస్పదంగా నగదు బదిలీ జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు సూచించారు.

Leave a Reply