సంక్షేమ పథకాలపై అవగాహన

సంక్షేమ పథకాలపై అవగాహన
మునుగోడు, ఆంధ్రప్రభ:
నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అశ్రీత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. “గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఫ్యామిలీ బెనిఫిట్స్ లింకేజెస్” అనే అంశంపై మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల కుటుంబ సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు క్షుణ్ణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కార్మికశాఖ అధికారి రాజు, పోస్టాఫీస్ అధికారి రమేష్, అశ్రీత స్వచ్ఛంద సంస్థ కో-ఆర్డినేటర్ ఎం. శోభారాణి పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభా కార్డు, ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన, కార్మికుల రక్షణ కోసం ఇచ్చే లేబర్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగ కార్మికులు, రోజువారీ కూలీలు కార్మిక శాఖ ద్వారా లభించే సంక్షేమ పథకాలను ఎలా పొందాలో వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అశ్రీత సంస్థ సిబ్బంది ధనమ్మ, కవిత, చిన్నారాయుడు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
