ప్రకాశ్ రాజ్–జోసెఫ్ రావణ్‌పై మంత్రి దుర్గేష్ తీవ్ర ఆరోపణలు

నాడు ప్యాలెస్ ఆకృత్యాలపై నో ఆస్కింగ్..
నేడు కూటమి ప్రభుత్వంపై జస్ట్ ఆస్కింగ్.. ఇదేనా మీ సిద్ధాంతం
ప్రకాష్ రాజ్, రావణ్ ల ద్వంద్వ నీతిని ఎండగట్టిన మంత్రి కందుల దుర్గేష్
కుల‌మ‌తాల మ‌ధ్య‌ చిచ్చుపెట్టే వారికి మంత్రి కందుల దుర్గేష్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రకాష్ రాజ్, జోసెఫ్ రావణ్ వెనుక తాడేపల్లి ప్యాలెస్ కుట్ర..
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌పై విషం చిమ్మితే చట్టం ఊరుకోదు

విజయవాడ, ఆంధ్రప్రభ: సోషల్ మీడియా వేదికగా కుల, మత విద్వేషాలు రేపుతూ, వ్యక్తిగత దూషణలకు దిగుతున్న దుర్మార్గులపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టానుసారం మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని కేపీ నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ సంచలన విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ గొంతు చించుకునే నటుడు ప్రకాష్ రాజ్, మత ఘర్షణలు సృష్టించేలా మాట్లాడే జోసెఫ్ రావణ్ మధ్య అపవిత్ర బంధం ఉందని, వీరుద్దరూ కలిసి కూటమి ప్రభుత్వంపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కుట్రపూరిత డిబేట్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు, ఆడియో లీక్స్‌ను మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా మీడియాకు బహిర్గతం చేశారు. ఇది కేవలం ప్రకాష్ రాజ్, రావణ్ వ్యవహారం కాదు. వీరి వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి తాడేపల్లి ప్యాలెస్ లోని ‘ప్యాలెస్ పార్టీ’ షెల్ కంపెనీల ద్వారా వీరికి ప్రతి నెలా భారీగా ఫండింగ్ అందుతోంది. రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు రేపి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. సనాతన ధర్మం, భారత జాతీయవాదం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కక్ష గట్టి, ఆయనను బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పనిచేస్తున్నాయి. తెర వెనుక ఉన్న ఆ అసలు కుట్రదారుల బండారాన్ని త్వరలోనే పోలీసులు ఛేదిస్తారని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.

2019 – 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన దారుణాలపై ప్రకాష్ రాజ్ ఎందుకు నోరు మెదపలేదని మంత్రి దుర్గేష్ నిలదీశారు. దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్ కక్షసాధింపు కారణం కాదా? అప్పుడు మీ గొంతు ఎందుకు మూగబోయింది? అని ప్రశ్నించారు. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి, శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ప్రకాష్ రాజ్, రావణ్ ఏ ప్యాలెస్‌లో నిద్రపోతున్నారు? అని నిలదీశారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగి, శ్రీరాముడి విగ్రహం తల నరికినప్పుడు మీ ‘జస్ట్ ఆస్కింగ్’ ఏమైపోయింది? కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం, వైసీపీని అసలు ప్రశ్నించకపోవడమేనా మీ సిద్ధాంతం? అని మంత్రి దుయ్యబట్టారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్‌ను కొనియాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి కళ్లున్న కబోది ప్రకాష్ రాజ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమాజాన్ని విడగొట్టే విమర్శలు చేయడం చాలా సులువని, కానీ కూలిపోతున్న వ్యవస్థలను చక్కదిద్దుతూ సమాజాన్ని నిర్మించడం చాలా కష్టమని, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ‘నిర్మాణ విక్రమార్కుడు’ అని మంత్రి అభివర్ణించారు. సినిమా స్క్రిప్ట్‌లు చదివి మాట్లాడేవారికి, ప్రజల సమస్యల స్క్రిప్ట్‌ను స్వయంగా చదివి పరిష్కరించే జనసేనాని వ్యూహం ఎప్పటికీ అర్థం కాదన్నారు. విమర్శల స్థాయి ప్రకాష్ రాజ్‌ది అయితే.. విశ్వసనీయత స్థాయి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దని, ఇలాంటి కుట్రలను ప్రజలు నమ్మరని, త్వరలోనే ఈ కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెడతామని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు.