కల్వర్టు మూసివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

కల్వర్టు మూసివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

  • మున్సిపల్ కమిషనర్‌కు రైతుల ఫిర్యాదు

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని జామచెట్ల బావికి వెళ్లే దారిలో ప్రభుత్వ కల్వర్టు నుండి వరద నీరు వెళ్లకుండా పెద్ద ఎత్తున అక్రమంగా అడ్డుగా మట్టి పోసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని, అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

వర్షాకాలంలో వరద నీరు సాఫీగా కిందకు వెళ్లేందుకు ప్రభుత్వ నిధులతో గత 30 ఏండ్ల క్రితం ఇక్కడ కల్వర్టును నిర్మించారు. ఇప్పుడు దానికి అడ్డుగా మట్టి పోయడం వల్ల వర్షాలు పడితే ఎగువ ప్రాంతాన ఉన్న తమ పొలాల్లో (చెల్కల్లో) వరద నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వానాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కల్వర్టుకు అడ్డుగా పోసిన మట్టిని తొలగించి తమకు న్యాయం చేయాలని రైతులు ధబ్బేటి చంద్రమౌళి, రమేష్, సత్యనారాయణ, సుదర్శన్ కోరారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ, శ్రీనివాస్, రాములు, సోంబాబు తదితర రైతులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply