ఎ.కొండూరు సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే కొలికపూడి
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ: ఎ.కొండూరు మండల సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మండల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, డ్రైనేజీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
మండలంలో ఫ్లోరైడ్ సమస్య కారణంగా గిరిజన తండాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలజీవన్ మిషన్ కింద రూ.50 కోట్లతో పనులు ప్రారంభించగా, 2019లో అవి నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి పైప్‌లైన్ ద్వారా కృష్ణా జలాలను మండలంలోని గ్రామాలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎ.కొండూరు, చీమలపాడు, గోపాలపురం గ్రామాల్లో కొత్త రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు అధికారులు వివరించారు.
గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికి రూ.65 కోట్లు మంజూరయ్యాయని, తిరువూరు మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.1 కోటి కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో మరో 55 రహదారుల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రతిపాదనలు అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని, బాల్యవివాహాలను అరికట్టి బాలికలకు ఉన్నత విద్య అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.
సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కంభంపాడు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎంపీటీసీ కోట పుల్లారావు వివరించారు. మండలంలో పాత వాటర్ ట్యాంకుల కారణంగా తాగునీరు కలుషితమవుతోందని, కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ భూక్యా గనియా కోరారు. అటవీ భూములు సాగు చేస్తున్న రైతులకు యూరియా పంపిణీపై కూడా చర్చ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కంభంపాడు ఎస్సీ కాలనీలో పర్యటించి డ్రైనేజీ సమస్యను పరిశీలించి అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో ఎంపీడీవో బొజ్జగాని శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం. ఉదయభాస్కరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
