సమస్యల సుడిగుండంలో ముగ్ధంపురం..!

  • మున్సిపాలిటీలో విలీనమైనా అభివృద్ధి జాడలేదు..
  • తాగునీటి కష్టాలు.. శిథిల భవనాలు.. నిరుపయోగమైన వాటర్ ప్లాంట్..
  • దయనీయ స్మశానవాటిక…
  • యువతకు యూత్ క్లబ్ లేదు..
  • ప్రత్యేక నిధులు కేటాయించి 11వ, 12వ వార్డులను ఆదుకోవాలని ఎమ్మెల్యేకు గ్రామస్తుల విజ్ఞప్తి..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలో విలీనమైతే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశించిన ముగ్ధంపురం ప్రజలకు ఆశలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని 11, 12వ వార్డులుగా ఉన్న ముగ్ధంపురంలో తాగునీటి సమస్య నుంచి శ్మశానవాటిక వరకు, శిథిల భవనాల నుంచి యువతకు యూత్ క్లబ్ వరకు అనేక సమస్యలు పేరుకుపోయాయని ప్రజలు వాపోతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ఉన్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

శిథిలావస్థలో వార్డు కార్యాలయం

సుమారు 20 ఏళ్ల క్రితం గ్రామపంచాయతీ కార్యాలయంగా నిర్మించిన భవనం ప్రస్తుతం 11వ వార్డు కార్యాలయంగా ఉన్నప్పటికీ పూర్తిగా శిథిలావస్థకు చేరిందనీ. తలుపులు, కిటికీలు చెదలు పట్టి పాడైపోగా, భవనంలో విద్యుత్ కూడా లేకుండా పోయింది. నేల కుంగిపోవడంతో భవనం ప్రమాదకరంగా మారిందనీ. భద్రత లేకపోవడంతో కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ కూడా దొంగల చేతికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

634 నల్లా కనెక్షన్లు… కానీ నీటి కోసం నిత్య పోరాటం

ఒకప్పుడు 250 నల్లా కనెక్షన్లకు సరిపోయేలా నిర్మించిన మంచినీటి ట్యాంక్ ప్రస్తుతం 634 కనెక్షన్లకు సరిపోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో రెండు బావులు ఉండగా ప్రస్తుతం ఒకటే పనిచేస్తోంది. మిషన్ భగీరథ ద్వారా తగినంత నీరు అందకపోవడంతో మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాడైపోయిన వాటర్ ప్లాంట్

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ఇప్పటి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారిందనీ. మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత ప్లాంట్ నిర్వహణ పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు నర్సంపేట, కాకతీయ నగరం, చెన్నారావుపేట ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రస్తుతం 11వ వార్డు కౌన్సిలర్ చీకటి సరూప ఓదయ్య గౌడ్ స్వయంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి గ్రామానికి తాగునీరు సరఫరా చేయిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

స్మశానవాటికలో సౌకర్యాల కొరత

రూ.13 లక్షలతో నిర్మించిన స్మశానవాటికలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బర్నర్లు పనిచేయడం లేదని, స్నానాల గదులు ఉన్నా నీటి సౌకర్యం లేక ఉపయోగం లేదని చెబుతున్నారు. శవదహనం అనంతరం అస్తికలు భద్రపరిచే గది కూడా నిరుపయోగంగా మారడంతో కొందరు చెట్లకు అస్తికలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. స్మశానవాటికలో అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బతుకమ్మ స్థలం ఆక్రమణలు…
మహిళలకు ఇబ్బందులు

గ్రామంలోని బతుకమ్మ ఆటస్థలం ఆక్రమణలకు గురవడం, అక్కడికి వెళ్లే రహదారి లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. గతంలో రెండు సార్లు బతుకమ్మ వేడుకలను ఇతర ప్రాంగణాల్లో నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

యువతకు యూత్ క్లబ్ భవనం లేదు

ఒకప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో గుర్తింపు తెచ్చుకున్న అభ్యుదయ యువజన సంఘం భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో యూత్ క్లబ్ భవనం నిర్మిస్తామని హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని మరిచిపోతున్నాయని విమర్శిస్తున్నారు.

“అన్నీ ఉన్నా… అభివృద్ధి లేదు”

మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలకవర్గం, కాంగ్రెస్ చైర్మన్, కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అభివృద్ధి కనిపించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” ఉన్నట్లు మా పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలి..

ముగ్ధంపురం 11, 12వ వార్డులకు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీరు, వాటర్ ప్లాంట్, వార్డు కార్యాలయం, స్మశానవాటిక, బతుకమ్మ స్థలం, యూత్ క్లబ్ తదితర సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఉన్నతాధికారులు ఒకసారి ముగ్ధంపురాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ప్రజల సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ రెండు వార్డులకు అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.