మధ్యతరగతి ప్రజలపై మరింత పెనుబారం

మధ్యతరగతి ప్రజలపై మరింత పెనుబారం
- సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ:
దేశ ప్రజలు అనేక అవస్థలు, ఇబ్బందులు పడుతుంటే వారిపై ఏమాత్రం కనికరం చూపకుండా కార్పొరేట్ కంపెనీల ఆస్తులను కూడబెట్టడంలోనే కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి విమర్శించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సర్వం కార్పొరేట్ సంస్థలకే దోచిపెట్టకుండా, ఈ దేశ సామాన్య ప్రజలపై కొంచెమైనా కనికరం చూపాలని డిమాండ్ చేశారు.
దేశంలో మళ్లీ డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే పది రోజుల క్రితం వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ ధరలను పెంచడం వల్ల అన్ని నిత్యవసర వస్తువులపై ఆ భారం పడిందని గుర్తుచేశారు. ఇప్పుడు మరొకపక్క డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ ధరలను ఏకంగా మూడు రూపాయల వరకు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యవసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్, సీఎన్‌జీ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరలను తగ్గించకపోతే ప్రజల నుండి తీవ్ర నిరసనలు, ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి లక్షల కోట్ల రూపాయలను కార్పొరేటు సంస్థలకు రాయితీల రూపంలో కల్పించిందని, అదే సమయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలపై మాత్రం పన్నుల భారం మోపిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు, శనిగరపు రాజ్ కుమార్, లక్ష్మణ్, మర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరితో పాటు గడ్డం రాజ నర్స్, మర్రి విజయ్, తండ ముండయ్య, చంద్రమౌళి, మల్లయ్య తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
