జిల్లాలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

జిల్లాలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

  • కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ:
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, పట్టణాల్లోని ప్రతి వార్డుకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో జిల్లాలో తాగునీటి పంపిణీ, సమస్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ నీటి సరఫరా పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్.. పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ల పనితీరు, నిల్వ ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని 460 గ్రామాలకు ప్రతిరోజూ 160 ఎంఎల్‌డీ తాగునీటి సరఫరా జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. బిజినపల్లి, కోడేరు, వెల్దండ, కొల్లాపూర్ మండలాల్లో నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డిండి రిజర్వాయర్ నుంచి అచ్చంపేట, సర్వాయిపల్లి, కొల్లాపూర్, ఎల్లూరు గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయం ఎంతో అవసరమన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని, ఫీల్డ్ స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నీటి సరఫరాపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Leave a Reply