బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటే సహా బీజేపీ నేతలు

ఆంధ్రప్రభ, నిర్మల్ జిల్లా (బాసర) : నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞానసరస్వతి దేవి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం బీజేపీ నేతలు దర్శించుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటే, జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆలయానికి చేరుకున్న వీరికి అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చి ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి నేతలను సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ బాసర ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, దాతల సహకారం సంతోషకరమని అన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు అన్ని వర్గాల నుంచి సహకారం లభించడం హర్షణీయమని తెలిపారు. బాలాలయం ఏర్పాటుతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వివరించినట్లు నేతలు పేర్కొన్నారు.