నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుపై దాడి

నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుపై దాడి

కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

మోత్కూర్,ఆంధ్రప్రభ : నీట్–2026 పేపర్ లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడిందని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతికుమార్ ఆరోపించారు. 22 లక్షలకుపైగా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని విమర్శించారు.

బుధవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఉప్పల శాంతికుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ జరగడం అత్యంత దారుణమని అన్నారు. రాజస్థాన్‌లోని సికర్ ప్రాంతం నుంచి లీకేజీ నెట్‌వర్క్ బయటపడినట్లు సమాచారం వచ్చిందని, లీకైన ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి, పరీక్షలను అవినీతి కేంద్రాలుగా మార్చే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జిట్టా గౌతం, విజయ్, లోకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.