గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యువకులు
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యువకులు
–254 గ్రాముల గంజాయి, నగదు స్వాధీనం
తొర్రూరు, ఆంధ్రప్రభ: గంజాయి సేవిస్తూ యువకులు పోలీసులకు పట్టుబడ్డ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది.ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అమ్మా పురం గ్రామానికి చెందిన కళ్యాణి విజయ్, దంతాలపల్లి సాగర్, గంధం మహేష్ లు జల్సాలకు అలవాటు పడి పనీ పాటా లేకుండా జులాయిగా తిరుగుతున్నారు. మద్యానికి అలవాటు పడ్డ యువకులు మరింత మత్తు కోసం గంజాయి తాగాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన వారి సహాయంతో గంజాయి సమాచారం తెలుసుకొని ఇటీవల ఒడిశా రాష్ట్రానికి ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఓ ముఠా దగ్గర గంజాయి కొనుగోలు చేశారు. ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసులకు చేరింది.
కాగా గంజాయి సేవించేందుకు బుధవారం అమ్మపురం గ్రామ శివారు క్వారీ రోడ్డు వైపు వెళ్లారు. అదనపు ఎస్సై ఖాదర్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానం వచ్చి యువకుల దగ్గర ఉన్న కవర్ ను పరిశీలించారు. ఆ కవర్లో రూ.12,700 విలువచేసే 254 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితోపాటు ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. సమాచారం అందించిన స్థానికునికి రూ.5 ఐదువేల నగదు బహుమతి అందజేశారు.డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో డ్రగ్స్ సరఫరా, సేవించిన వారి సమాచారం అందిస్తే తగిన పారితోషకం అందిస్తామని ఎస్సై తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు సారయ్య, వేణు, శరత్, బావ్ సింగ్ లు పాల్గొన్నారు.
