38-smart-kitchens : ఇక చ‌ద్ద‌న్నం నో ,, Andhra Prabha Top Story

38-smart-kitchens : ఇక చ‌ద్ద‌న్నం నో ,, Andhra Prabha Top Story

  • స్మార్ట్ కిచెన్లు రెడీ
  • విద్యార్థులకు ఆరోగ్యం
  • మహిళలకు ఉపాధి
  • ..రూ.29.70 కోట్లతో కడపలో విస్త‌ర‌ణ
  • మరో 33 కేంద్రాలతో మొత్తం 38 స్మార్ట్ కిచెన్లు
  • .లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం
  • .నియోజకవర్గాల వారీగా విస్తరణ
  • .రూ.90 లక్షలతో ఒక్కో కేంద్రం
  • 20 భవనాలు పూర్తి
  • మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా .ఆగస్టులో ప్రారంభం

( కడప బ్యూరో, ఆంధ్రప్రభ)

వైఎస్సార్ కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, వేడివేడిగా, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఐదు కేంద్రాలకు తోడు మరో 33 స్మార్ట్ కిచెన్లను రూ.29.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. మొత్తం 38 కేంద్రాల ద్వారా 1,778 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,00,091 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన వేడి భోజనం అందించనుంది. స్టీమ్ కుకింగ్, ఆర్వో ప్లాంట్లు, బయోడైజెస్టర్లు, సౌర విద్యుత్, జీపీఎస్ ఆధారిత సరఫరా వంటి ఆధునిక సాంకేతికతతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఆగస్టు రెండో వారంలో ఈ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించేందుకు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, మధ్యాహ్న భోజనం వేడివేడిగా అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు వేగంగా సాగుతోంది. ఇప్పటికే విజయవంతంగా పనిచేస్తున్న ఐదు స్మార్ట్ కిచెన్లకు తోడు మరో 33 కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. దీంతో జిల్లాలో మొత్తం 38 స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రూ.29.70 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆధునిక స్టీమ్ కుకింగ్ విధానం, సౌర విద్యుత్, బయోడైజెస్టర్, ఆర్వో ప్లాంట్లు, జీపీఎస్ ఆధారిత రవాణా వ్యవస్థలతో పరిశుభ్రమైన పోషకాహారాన్ని విద్యార్థులకు అందించనున్నారు. ఆగస్టు రెండో వారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

38-smart-kitchens : లక్ష మంది విద్యార్థులకు

కొత్తగా ఏర్పాటు చేస్తున్న 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా జిల్లాలోని 1,630కుపైగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 90 వేల మంది విద్యార్థులకు వేడి భోజనం అందించనున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న ఐదు స్మార్ట్ కిచెన్ల పరిధిలో 160 పాఠశాలలకు చెందిన 10,175 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. మొత్తం 1,778 విద్యాసంస్థల్లోని 1,00,091 మంది విద్యార్థులు ఈ స్మార్ట్ కిచెన్ల సేవలను పొందనున్నారు.

38-smart-kitchens : నియోజకవర్గాల వారీగా విస్తరణ

జిల్లాలోని అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బద్వేల్‌లో 7, పులివెందులలో 7, జమ్మలమడుగులో 5, కమలాపురంలో 5, మైదుకూరులో 5, ప్రొద్దుటూరులో 2, రాజంపేటలో 2 స్మార్ట్ కిచెన్లు నిర్మిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఈ విస్తరణ చేపట్టింది.

38-smart-kitchens : రూ.90 లక్షలతో ఒక్కో కేంద్రం

ప్రతి స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి రూ.90 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇందులో భవన నిర్మాణానికి రూ.38 లక్షలు, ఆధునిక కిచెన్ పరికరాలు, రెండు ప్రత్యేక వాహనాలు, ఆర్వో ప్లాంట్, బయోడైజెస్టర్, 10 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ, షెడ్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, టీవీలు, నేమ్‌బోర్డులు తదితర సదుపాయాల కోసం రూ.52 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆహార తయారీ నుంచి పాఠశాలలకు సరఫరా వరకు ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఏర్పాట్లు చేశారు.

38-smart-kitchens : 20 భవనాలు పూర్తి…

ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 20 స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 13 భవనాలు తుదిదశలో ఉన్నాయి. బద్వేల్, చెన్నూరు, చక్రాయపేట, రాజుపాలెం, ఎర్రగుంట్ల, పులివెందుల, సింహాద్రిపురం, ఖాజీపేట, ప్రొద్దుటూరు, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు, పోరుమామిళ్ల, కమలాపురం, వల్లూరు, వి.ఎన్.పల్లి తదితర ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. గుర్తించిన చిన్నపాటి లోపాలను సరిచేసి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

38-smart-kitchens : సాంకేతికతతో నాణ్యతకు పెద్దపీట

స్మార్ట్ కిచెన్లలో స్టీమ్ ఆధారిత వంట విధానంతో పెద్ద మొత్తంలో పరిశుభ్రమైన ఆహారం తయారుచేస్తారు. ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీటినే వినియోగిస్తారు. బయోడైజెస్టర్ ద్వారా వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహిస్తారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జీపీఎస్ ద్వారా భోజనం తీసుకెళ్లే వాహనాలను పర్యవేక్షిస్తూ సమయానికి పాఠశాలలకు వేడి భోజనం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా మొత్తం నిర్వహణపై నిరంతర నిఘా ఉంటుంది.

38-smart-kitchens : మహిళలకు ఉపాధి

స్మార్ట్ కిచెన్ల ద్వారా వేడి, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందడంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాఠశాల హాజరు శాతం, అభ్యాస ఫలితాలు కూడా పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వంట, ప్యాకింగ్, పంపిణీ బాధ్యతలు అప్పగించి ఉపాధి కల్పించనున్నారు. వారికి ప్రత్యేక యూనిఫాంలు అందించడంతో పాటు అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికుల సేవలను కూడా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

38-smart-kitchens : మూడో దశకు సిద్ధం

రెండవ దశలో 38 స్మార్ట్ కిచెన్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిన వెంటనే మూడోదశ విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. రాజంపేట, వీరబల్లి, నందలూరు, సుండుపల్లె, కడప నగరంలో మరో కేంద్రం, ప్రొద్దుటూరు అర్బన్‌లో మరో కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీంతో భవిష్యత్తులో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి నాణ్యమైన, వేడి, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరనుంది.