కపిలగిరి కొండపై కనికరం లేదా..

కపిలగిరి కొండపై కనికరం లేదా..

గుట్టపైకి ఘాట్ రోడ్డు లేక భక్తుల ఇబ్బందులు
ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యండి రామచంద్రా..
రేపు శ్రీ యోగానంద లక్ష్మీ నృరసింహ స్వామి కళ్యాణం

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో కపిలగిరి కొండపై వెలసిన చెంచు లక్ష్మి,ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కాకతీయుల కంటే ముందే చోళులు పరిపాలించిన సమయంలో శ్రీ కపిల మహామునేశ్వరుడు అనే ముని కొండపైకి వచ్చి తన తపస్సుతో నరసింహస్వామి సైకత శిల్పాన్ని సృష్టించాడు.అప్పటి నుండి ఆ స్వామి వారి పేరు మీదనే నర్సింహులపేటగా గ్రామానికి నామకరణం జరిగింది.

స్వామి వారి ఆలయ చరిత్ర..

కాకతీయుల కంటే ముందే చోళుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం నందు యోగానంద మహామునీశ్వరుడు తన తపస్సుతో సైకత శిల్పాన్ని సృష్టించాడు.అప్పటి నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూ ప్రతి యేటా అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి.

రేపు స్వామివారి కళ్యాణం..

29 నుండి ప్రారంభమైన అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు,1న ఎదుర్కోలు తిరు కళ్యాణోత్సవం,2న బలిహరణ సుదర్శన హోమం,3న పారువేట(బండ్లు తిరుగుట)4న చివరి రోజున చక్రస్నానం ఏకాంత సేవలతో పరిసమాప్తి జరుగును.

గుట్టపైకి రోడ్డు సౌకర్యం లేక భక్తులకు ఇబ్బందులు..

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గుట్టపైకి ఎక్కడానికి భక్తుల ఇబ్బందుల ఇబ్బందులను గ్రహించి చైర్మన్ కొత్త రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాతల నుండి సేకరించిన విరాళాలతో మెట్ల మార్గాన్ని నిర్మించారు.అప్పుడు భక్తులు బాగానే ఎక్కిన గాని ఇప్పటి పరిస్థితుల్లో అన్ని మెట్లను ఎక్కలేక రాను రాను భక్తుల రద్దీ తగ్గిపోయింది.

అభివృద్ధి చేస్తే ఆదరణ పెరుగుతుంది..

గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రత్యేక నిధులు(ఎస్డిఎఫ్)ల మంజూరుతో టెండర్ పిలిచారు.కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రద్దయింది.ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కూడా (సిఆర్ఆర్) నిధుల మంజూరుకు నివేదికను పంపడం జరిగిందని పంచాయతీరాజ్ ఏఈ సుగుణాకర్ తెలిపారు.స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రయత్నంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.