అప్పుల బాధతో ఏఈఓ ఆత్మహత్య

అప్పుల బాధతో ఏఈఓ ఆత్మహత్య
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పుల భారం, వడ్డీ వ్యాపారులు, చిటఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుంటోజు బాలరాజు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఉరుమడ్ల గ్రామానికి చెందిన బాలరాజు ప్రస్తుతం కేతపల్లి మండలంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిపారు.
అప్పుపై అధిక వడ్డీలు లెక్కించడంతో పాటు, ముందస్తుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, చిటఫండ్ ఏజెంట్లు గత కొంతకాలంగా బాలరాజుపై ఒత్తిడి తెచ్చి మానసికంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మృతుని భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
