Telangana Bhavan | హరీష్ రావు – పోలీసుల మధ్య వాగ్వాదం


Telangana Bhavan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చించేందుకు మంత్రులు సిద్ధమయ్యారు. అలాగే మంత్రలు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, తదితరులు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు గన్‌పార్క్‌లో మంత్రులతో చర్చలకు వెళ్లేందుకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా హరీష్ రావు కారులో నుంచే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే తన ఫోన్ కాల్‌కు మంత్రి స్పందించలేదని హరీష్ రావు ఆరోపించారు. మంత్రులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) వద్దకు రావాలని మంత్రులే తనను ఆహ్వానించారని, తమ కోసం వారు అక్కడ ఎదురుచూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.