రైతులను ఇబ్బందులకు గురి చేసే తహసీల్దార్లను శిక్షించాలి

రైతులను ఇబ్బందులకు గురి చేసే తహసీల్దార్లను శిక్షించాలి

  • రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మన్నె నర్సింహారెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; రైతుల భూ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేసే తహసీల్దార్లను కఠినంగా శిక్షించాలని రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మన్నే నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ తహసీల్దారుల నిర్లక్ష్యం వల్ల అనేకమంది రైతులు మనోవేదనతో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూభారతి చట్టం అమలులో కొద్దిమంది తాహసిల్దారులు భూ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

భూభారతి చట్టంలో సెక్షన్ 4, 5 కింద చాలా భూ సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందని, తాహసిల్దారులు సరిగా స్పందించకుండా రైతులని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి తాహసిల్దార్లని కఠినంగా శిక్షించాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక రైతు తన భూమి ఇతరుల పైన పట్టా అయిందని జరిగిన పొరపాటున సరిదిద్దమని 9 సంవత్సరాలుగా తాహసిల్దార్ కార్యాలయానికి తిరిగాడు, అప్లికేషన్లు పెట్టాడు కానీ సమస్య పరిష్కారం కాలేదు, విధిలేని పరిస్థితిలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇలాంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి భూభారతి చట్టంలో అవకాశం ఉన్నా పలువురు తాహసిల్దార్లు కు చట్టంపై అవగాహన లేకుండా రైతులను ఆఫీసులో చుట్టూ తిప్పుతూ సరైన సహకారం చేయకుండా రైతుల ప్రాణాలు తీస్తున్నారని నరసింహారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాస్తవాలను తెలుసుకొని బాధ్యులైన తాహసిల్దార్ లపై కఠిన చర్యలు తీసుకుంటే రైతులంటే గౌరవం ఉంటుందన్నారు.

నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు ఎం సునీల్ కుమార్ లు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆ గ్రామానికి వెళ్లి కలిసి ఓదార్చినందుకు గాను వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పాటి యాదిరెడ్డి, మల్లెపెల్లి ప్రముఖరెడ్డి, సిద్ధగోని శ్రీనివాస్ తదితర రైతు నాయకులు ఉన్నారు.