ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్ ఆదేశాలు
వరికి బదులు పప్పు ధాన్యాలు పండించాలి
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఫార్మ్ పాండ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున ఈ ఖరీఫ్‌లో వరి సాగుకు బదులుగా కందులు, పెసలు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రాబోయే పది రోజులను ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని గ్రామాల వారీగా రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించాలని, ప్రతిరోజూ పురోగతి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఒంటరి మహిళా రైతులు, చిన్న, సన్నకారు రైతులకు అదనపు ప్రోత్సాహం అందిస్తామని, ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 2.91 లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
