తత్కాల్ టికెట్ ఇక రాకెట్ స్పీడ్!

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు సరికొత్త రూపు
  • నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్ సామర్థ్యం
  • అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లకు చెక్
  • సీట్ల ఎంపిక నుంచి తక్కువ ధరల తేదీల వరకు కొత్త సౌకర్యాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రైలు తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటేనే టెన్షన్..! బుకింగ్ మొదలైన మరుక్షణమే వెబ్‌సైట్ నెమ్మదించడం.. క్యాప్చా దగ్గర చిక్కులు.. మధ్యలో పాప్‌అప్‌లు.. చివరకు చెల్లింపు పూర్తయ్యేలోపే టికెట్లు అయిపోవడం! రైల్వే ప్రయాణికులకు చిరపరిచితమైన ఈ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా ఐఆర్‌సీటీసీ తన టికెట్ బుకింగ్ వ్యవస్థను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది.

కొత్త వ్యవస్థలో బుకింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32 వేల బుకింగ్‌లను నిర్వహించే సామర్థ్యాన్ని 1.5 లక్షలకు పైగా బుకింగ్‌ల స్థాయికి పెంచేలా వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. దీంతో ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెబ్‌సైట్‌ను ఉపయోగించినా వేగంగా స్పందించేలా మార్పులు చేస్తున్నారు.

క్యాప్చా చికాకులకు చెక్!

టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టే అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లు, మెరుస్తూ కనిపించే గ్రాఫిక్స్ వంటి ఆటంకాలను తగ్గించేలా కొత్త రూపకల్పన చేస్తున్నారు. అయితే క్యాప్చాను పూర్తిగా తొలగిస్తున్నారనే ప్రచారం కంటే, అనవసర క్యాప్చాలను తగ్గించి ధ్రువీకరణను సులభతరం చేస్తున్నారనడమే సరైనది. కొత్త వెబ్‌సైట్ బీటా రూపంపై పరీక్షలు జరుగుతున్నట్లు రైల్వే వర్గాల సమాచారం.

సీట్లు ఉన్నాయో లేదో చూసుకోవడానికి ప్రతి క్లాసును విడివిడిగా తెరవవలసిన శ్రమ తగ్గుతుంది. వివిధ ప్రయాణ క్లాసులలో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూసేందుకు ఒక కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఏ క్లాసులో సీటు అందుబాటులో ఉందో త్వరగా తెలుసుకుని, బుకింగ్ ప్రక్రియను కొనసాగించవచ్చు.

నచ్చిన సీటు.. ధరల క్యాలెండర్!

ప్రయాణికుల సౌకర్యం కోసం సీటు ప్రాధాన్యత, ఛార్జీల క్యాలెండర్ వంటి సౌకర్యాలనూ కొత్త వ్యవస్థలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఛార్జీల క్యాలెండర్ ద్వారా ప్రయాణ తేదీలను బట్టి ధరలను పరిశీలించి అనుకూలమైన తేదీని ఎంచుకునే అవకాశం ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి.

కొత్త రూపకల్పనను వేగం, సులభమైన వినియోగం, తక్కువ దశల్లో బుకింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టి సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇంటి నుంచే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా రైలు టికెట్లను మరింత సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది. ఐఆర్‌సీటీసీ అధికారిక రైల్ కనెక్ట్ యాప్ కూడా టికెట్ బుకింగ్, సీట్ల లభ్యత, బుకింగ్ నిర్వహణ వంటి సేవలను అందిస్తోంది.

తత్కాల్ టికెట్ కోసం సెకన్లతో పోటీపడే ప్రయాణికులకు కొత్త వ్యవస్థ ఊరటనిచ్చే అవకాశం ఉంది. నిమిషానికి 1.5 లక్షలకు పైగా బుకింగ్‌ల సామర్థ్యం, తక్కువ ఆటంకాలతో సరళమైన రూపకల్పన పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ అనుభవం గణనీయంగా మారనుంది.