Taiwan China Conflict | తైవాన్ వివాదంపై మరోసారి చైనా హెచ్చరికలు

Taiwan China Conflict | తైవాన్ వివాదంపై మరోసారి చైనా హెచ్చరికలు
Taiwan China Conflict | అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న దౌత్య ఉద్రిక్తతలు
తైవాన్ స్వతంత్రతపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం
సెమీకండక్టర్ రంగంపై యుద్ధ ప్రభావం భయం
చైనా వ్యతిరేకతకు తైవాన్ ప్రజల మద్దతు
Taiwan China Conflict | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జరిపిన చైనా పర్యటనలో తైవాన్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. తైవాన్ విషయంలో ఏమాత్రం దుందుడుకు తనంతో వ్యవహరించినా, తాము సహించేది లేదని అమెరికాకు చైనా అల్టిమేటం జారీ చేసింది.
చైనా-తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. ఏడు దశాబ్దాల నుంచి ఈ వివాదం నడుస్తోంది. కాగా రెండు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఈ వివాదాలు రాజుకున్నప్పుడల్లా తైవాన్‌కు అమెరికా సంఘీభావం ప్రకటించడం, దీనిపై చైనా మండిపడటం యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది. ఇక విషయానికి వస్తే, తైవాన్ ఇప్పటికీ తమ భూభాగమే అనేది డ్రాగన్ కంట్రీ వాదన. అయితే చైనా వాదనను తైవాన్ కొట్టిపడేస్తోంది. తమది ప్రత్యేక దేశం అన్నది తైవాన్ వాదన.
తైవాన్ స్వతంత్ర దేశమా? కాదా? అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆ దేశం పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. చిన్న దేశమైన తైవాన్‌ను కబళించడానికి డ్రాగన్ చైనా రెడీ అవుతోందన్న సంకేతాలు అందుతున్నాయి. వాస్తవానికి తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని ఓ ద్వీపం. 77 సంవత్సరాల కిందట చైనాలో అంతర్యుద్ధం వచ్చింది. ఈ అంతర్యుద్ధం సమయంలో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. అయితే తైవాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించలేదు.
ఈ సంగతి పక్కన పెడితే, దశాబ్దాల నుంచి తైవాన్ తన మానాన తాను బతుకుతోంది. ఏ విషయంలోనూ చైనాపై తైవాన్ దేశం ఆధారపడటం లేదు. అయితే ద్వీప దేశమైన తైవాన్ అలా స్వతంత్రంగా బతకడం డ్రాగన్ చైనాకు నచ్చలేదు. మళ్లీ తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసింది. అయితే తైవాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా చైనా వెనక్కి తగ్గేది.

ఇదిలా ఉంటే, 1980లో రెండు దేశాల మధ్య విభేదాలు కొంతవరకు తగ్గాయి. ఈ సమయంలోనే తైవాన్‌ను బుజ్జగించడానికి చైనా ఒక ప్రతిపాదన చేసింది. “ఒక దేశం – రెండు వ్యవస్థలు” అనేది చైనా చేసిన ప్రతిపాదన. అంతేకాదు, తమ సార్వభౌమాధికారాన్ని తైవాన్ అంగీకరిస్తే పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది. దీంతోపాటు పాలన విషయంలో తైవాన్‌కు కొంతవరకు స్వతంత్రత కూడా కల్పిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని చైనా పరోక్షంగా సంకేతాలిచ్చింది.
తేనె పూసిన కత్తి లాంటి చైనా ప్రతిపాదనను తైవాన్ ప్రజలు అంగీకరించలేదు. చైనా ప్రతిపాదనకు వ్యతిరేకంగా తైవాన్‌లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాగా ఏడు దశాబ్దాలుగా తైవాన్ విషయంలో చైనా దేశం దుందుడుకు తనంతోనే వ్యవహరిస్తోందన్నది వాస్తవం. అంతేకాదు, తైవాన్ వివాదానికి దూరంగా ఉండాలని అగ్రరాజ్యమైన అమెరికాకు చైనా గతంలోనే హుకుం జారీ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
అంతూపొంతూలేని చైనా ఆగడాలు!
చైనా ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. కీలకమైన తైవాన్ జలసంధిని మింగేయడానికి ఎత్తుగడలు వేస్తోంది. ఒక దశలో తైవాన్ జలసంధిలోకి వచ్చే పౌర నౌకలను తనిఖీ చేయడానికి సన్నద్ధమైంది. ఇతర దేశాల నౌకలపై పెత్తనం చేయడానికి రెడీ అయింది. ఇదిలా ఉంటే, తైవాన్ మీద చైనా దాడి చేస్తే దానికి కౌంటర్‌గా అమెరికా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచ రాజకీయాల్లో దుమారం చెలరేగడం ఖాయం అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువకాలం కొనసాగితే ఆ ప్రభావం చైనా జీడీపీపై కూడా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తైవాన్ మీద చైనా దాడులు చేయడం అంటూ జరిగితే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ మీద పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ వాటా 30 శాతానికి పైగా ఉంది. అత్యాధునిక సెమీకండక్టర్లను తైవాన్ తయారు చేస్తోంది.
ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఉపయోగించే సెమీకండక్టర్లన్నీ ప్రస్తుతం తైవాన్ నుంచే సరఫరా అవుతున్నాయి. యుద్ధం అంటూ వస్తే, తైవాన్‌లో సెమీకండక్టర్ల తయారీ, వాటి సరఫరా కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు.
చైనా వ్యతిరేకతకు జై కొట్టిన తైవాన్
2024 జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకతకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చైనా వ్యతిరేకతనే అజెండాగా జనంలోకి వెళ్లిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ)కి జనం పట్టం కట్టారు. అంతిమంగా డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి తైవాన్ ప్రజలు మరోసారి అధికారం అప్పగించారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయ్ చింగ్ విజయం సాధించారు. ఎన్నికలు జరిగేనాటికి లాయ్ చింగ్ తైవాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలుపొందడం అంటే చైనా ఆధిపత్యానికి తైవాన్ సవాల్ విసిరినట్లే.
– ఎస్. అబ్దుల్ ఖాలిక్
6300174320
