Operation Indi | ఇండియా కూటమి పార్టీలపై బీజేపీ ఫోకస్

Operation Indi | ఇండియా కూటమి పార్టీలపై బీజేపీ ఫోకస్

Operation Indi | తమిళనాడులో డీఎంకేపై కమలం ప్రత్యేక వ్యూహం
జార్ఖండ్‌లో జేఎంఎంను ఆకర్షించే ప్రయత్నాలు
ఎన్డీఏ బలోపేతానికి బీజేపీ కొత్త ఎత్తుగడలు
దేశ రాజకీయాల్లో భారీ మార్పుల సంకేతాలు

Operation Indi | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూపాంతరం చెందుతూ వస్తోంది. రాజకీయంగా బలమైన శక్తిగా నిలిచేలా, ప్రత్యర్థులను చిత్తుచేసేలా ఎత్తుగడలను ప్రయోగిస్తోంది.

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోవడంతో ఇండియా కూటమి బలంగా కనిపించింది. ఆ సమయంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను ఒకటి చేసినట్లుగా మారింది. ఇప్పుడు కమలం అగ్రనేతలు వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇండియా కూటమిలోని బలమైన పార్టీలు, లోక్‌సభ్యులు ఎక్కువగా ఉన్న పార్టీలను తమవైపుకు తీసుకువచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లుగా హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి.

డీఎంకేకు 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఏఐఏడీఎంకే ఎలాగూ బీజేపీతోనే ఉంది. ఏఐఏడీఎంకేలోనూ ముసలం కొనసాగుతోంది. బీజేపీని కాదని, లేదా ఆ పార్టీని ఎదిరించి ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే పార్టీ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో కమలం పక్కా ప్లాన్‌తో ఆ రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ సభ్యుల బలాన్ని తమ వైపుకు మళ్లించుకునేలా చేస్తోందని సమాచారం. అందులో భాగంగా డీఎంకేతో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ గుడ్‌బై చెప్పి టీవీకేతో కలవడంతో ఆ పార్టీ బీజేపీ వైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు డీఎంకే, బీజేపీ మధ్య బంధం బలపడుతోందని హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరు పార్టీల మధ్య సైతం అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. తమిళనాడులో బీజేపీ స్వయంగా గెలిచే పరిస్థితి లేదు. కనీసం 10 స్థానాలను కూడా దక్కించుకునే అవకాశాలు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీని ఆ రాష్ట్రంలో ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గత పదేళ్లుగా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నాయి. దీంతో బీజేపీ ఖాతాలోనే ఉంటున్నాయి. తమిళనాట ఆంధ్రా స్ట్రాటజీతో కమలం వడివడిగా అడుగులు వేస్తుండగా, రాష్ట్రంలో ఏ క్షణంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే ఉత్కంఠ నెలకొంది.

జార్ఖండ్‌లోనూ కమలం స్ట్రాటజీ..

ఇండియా కూటమిలో ఉన్న మరో బలమైన పార్టీగా జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా, జేఎంఎంతో గట్టి పోటీగా నిలబడుతూ వస్తోంది. కానీ మారిన పరిస్థితుల్లో జేఎంఎంను తమ వైపుకు తిప్పుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా హస్తిన వర్గాలు పేర్కొన్నాయి. జేఎంఎం కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అంతర్గతంగా చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇండియా కూటమిలో నుంచి జేఎంఎంను బయటకు తీసుకువచ్చేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందాలు జరిగాయని హస్తిన వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. అంతేకాదు, ఒకటి రెండు నెలల్లో ఈ పరిణామాలన్నీ వేగంగా జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. డీఎంకే, జేఎంఎం రెండు పార్టీలు ఇండియా కూటమిలో బలంగా ఉండటంతో వాటిపై బీజేపీ గట్టిగా నజర్ పెట్టింది.

ఆ రెండు పార్టీలు కూడా కమలం చెంతకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో బీజేపీకి మార్గం సులువుగా మారుతోందని హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మిగతా రాష్ట్రాల్లోని కొన్ని చిన్న పార్టీలను కూడా తమ వైపుకు తిప్పుకోవడం లేదా తటస్థంగా ఉండేలా ప్రోత్సహించడం లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

లోక్‌సభలో బలం పెరగాలంటే ఆయా పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలవకుండా ఉంటేనే బీజేపీకి మార్గం సులభం అవుతుందని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌తో కలిస్తే బీజేపీ ఇరకాటంలో పడిపోవడం జరుగుతూ వస్తోంది. వీటన్నింటి మధ్య కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేయడం లేదా ఎన్డీఏ కూటమి బలం పెంచుకోవడం లాంటి వాటితో తమకు కలిసి వస్తుందని, తిరుగులేని విధంగా మారుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య త్వరలోనే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply