26thMaychintana | హనుమంతుడి మార్గంలో మూడు రకాల ఆటంకాలు

26thMaychintana | హనుమంతుడి మార్గంలో మూడు రకాల ఆటంకాలు

26thMaychintana | సుందరకాండ పారాయణం వెనుక ఉన్న అసలు సందేశం
సాత్త్విక, రాజస, తామస ఆటంకాల అర్థం ఏమిటి?
జీవిత సమస్యలను ఎదుర్కొనే హనుమంతుడి వ్యూహం
సుందరకాండ ద్వారా కార్యసాధనకు మార్గదర్శనం

26thMaychintana | సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే, కేవలం పారాయణ చేసినంత మాత్రాన ఏదో హనుమచ్చక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు.

సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివితే కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకోవచ్చన్నదే పెద్దల ఉద్దేశ్యం. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కాని ఫలితం ఉండదు. హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తుంటే మూడు రకాల ఆటంకాలు ఎదురయ్యాయి.

మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది. ఇది సాత్త్విక ఆటంకం. తర్వాత సురస అనే రాక్షసి ఆకాశ మార్గానికి అడ్డంగా వచ్చి, తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణీ ముందుకు వెళ్లలేదని పంతం పట్టింది. ఇది రాజస ఆటంకం. ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రాహిణి మాటామంతీ లేకుండా కిందికి లాగేయడం మొదలుపెట్టింది. ఇది తామస ఆటంకం.

కార్యసాధకుడైన హనుమంతుడు ఈ మూడు ఆటంకాలనూ మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు. మైనాకుడు మర్యాదలు చేయడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి, అతనితో మర్యాదగానే మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్లిపోయాడు. సురస ఆంజనేయుణ్ణి మింగేద్దామని నోరు తెరిచింది. స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపయ్యాక సమయం వృథా అవుతోందని గమనించి, అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజస ఆటంకాల నుండి బయటపడే ఉపాయం అది.

ఆ తర్వాత సింహిక ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి, తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకి లాగి ఒక్క గుద్దుతో పైలోకాలకు పంపేశాడు. అంటే తమోగుణానికి దండనతో బదులు చెప్పాడన్న మాట. అట్లా మనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని, ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకు తొలగించాలి. మరికొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడినా, సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి.

తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణచివేయాలి. అక్కడ మెతకదనం పనికిరాదు. ఒక్క వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా సుందరకాండలోని ఘట్టాలను అవగాహన చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉంటుందా? అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి.

– దండంరాజు రాంచందర్ రావు

Leave a Reply