iBomma piracy | మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ

iBomma piracy | మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ

iBomma piracy | పైరసీ సైట్లపై సినీ పరిశ్రమ ఆందోళన
కొత్తగా వెలుగులోకి వచ్చిన ఐబొమ్మ వెబ్‌సైట్
సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు ప్రారంభం
సినిమాల లీక్‌తో కలెక్షన్లపై ప్రభావం
టాలీవుడ్‌కు వందల కోట్ల నష్టం

iBomma piracy | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: పైరసీ రాక్షసి సినీ పరిశ్రమను వదలడంలేదు. ఐ బొమ్మపై కేసు నమోదైనా.. అడ్మిన్ కటకటాల్లోకి వెళ్లినా ఆన్లైన్ పైరసీ సైట్లు ఆగడంలేదని సినీ పరిశ్రమ పెద్దలు అంటున్నారు. కంచికి చేరిందనుకున్న ఐ బొమ్మ కథ మళ్లీ మొదటికొచ్చింది. రవి అరెస్ట్లో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఈ వెబ్ సైట్ మళ్లీ ప్రత్యక్షమయ్యింది. అదీ.. లేటెస్ట్గా విడుదలైన కొత్త సినిమాలన్నీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఫిలిం చాంబర్ వర్గాలు ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

‘ఐ బొమ్మ’, ‘బప్పంటీ వీ’ పేర్లతో నడుస్తున్న వెబ్సైట్లు తాజాగా విడుదలైన పలు సినిమాలను ఆన్లైన్లో లీక్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అధికారికంగా ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించేలా పైరసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నాకు ఎలాంటి సంబంధం లేదు: రవి

ఇదిలా ఉంటే, గతంలో ‘ఐ బొమ్మ’ పేరుతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగిన ఇమంది రవి స్పందించారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ‘ఐ బొమ్మ’ వెబ్సైట్తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును, ‘ఐ బొమ్మ’ బ్రాండ్ను దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు కొత్త వెబ్సైట్ను సృష్టించారని ఆరోపించారు.

ఇటీవల విడుదలైన పలు తెలుగు సినిమాలు ఆన్లైన్లో లీక్ కావడంతో నిర్మాతలు, దర్శకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ వెబ్సైట్లలో కనిపించడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతోందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

పోలీసుల చర్యలు..

సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ‘ఐ బొమ్మ’, ‘ఒప్పం టీవీ’ వెబ్సైట్ల నిర్వాహకులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ సర్వర్లు ఎక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి?, వెబ్సైట్ల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమ ప్రతినిధులు పైరసీని అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సినీ పరిశ్రమకు భారీ నష్టం..

ఐ బొమ్మ… బప్పం వెబ్ సైట్లు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వందల కోట్ల నష్టం మిగిల్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన గంటల్లోనే సినిమాలు ఈ వెబ్ సైట్లలో ప్రత్యక్షమయ్యేవి. రూపాయి ఖర్చు లేకుండా లేటెస్ట్ సినిమాలు చూసే అవకాశం ఉండటంతో లక్షల మంది ఈ వెబ్ సైట్లకు అభిమానులుగా కూడా మారారు.

ఆయా వెబ్ సైట్లు.. కోట్లు ఖర్చు చేసి తీస్తున్న సినిమాల పైరసీ వర్షన్ వెబ్ సైట్లలో వస్తుండటంతో టాలీవుడ్ వర్గాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు గత ఏడాది ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు పైరసీ చేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి దమ్ముంటే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న సైబర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఐ బొమ్మ.. బప్పం వెబ్ సైట్లు కనిపించకుండా పోయాయి. అయితే, తాజాగా మరోసారి ఈ రెండు వెబ్ సైట్లు ప్రత్యక్షం అయ్యాయి. అదికూడా లేటెస్ట్గా విడుదలైన సినిమాలతో రావడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది.

Leave a Reply