భక్తుల సౌకర్యం కోసం ధర్మపురి ఆలయ అభివృద్ధి

  • గోదావరి పుష్కరాలకు సకల ఏర్పాట్లు
  • ఆలయ మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక సమావేశం
  • దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

ధర్మపురి (ఆంధ్రప్రభ): జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం కూడా సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ధర్మపురి ఆలయ మాస్టర్ ప్లాన్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంట్స్ డైరెక్టర్ హరీష్, శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈవో తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. “వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికులు, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఉండాలి. ఆలయం స్వయంభూ మూర్తి స్థలమైనందున ఆధ్యాత్మిక గౌరవాన్ని కాపాడే విధంగా పునర్నిర్మాణం జరగాలి” అని సూచించారు.

2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, పుష్కర స్నానాల కోసం వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు.

మాస్టర్ ప్లాన్‌లో అవసరమైన భూసేకరణ వివరాలను తెలుసుకున్న మంత్రి, స్థల పురాణం ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.50 కోట్లతో చేపట్టే నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడకూడదని ఆమె స్పష్టం చేశారు.

వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘నా స్వస్థలమైన ధర్మపురి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి సురేఖగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి పనిఒత్తిడిలోనూ మా దేవాలయం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం ప్రశంసనీయం. భూసేకరణ వంటి అంశాల్లో నేనే స్వయంగా చొరవ తీసుకుంటాను. పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తాము” అని తెలిపారు.

మాస్టర్ ప్లాన్‌లో భాగంగా… ప్రధాన దేవాలయ విస్తరణ, వైకుంఠ ద్వారం నిర్మాణం, క్యూలైన్ కాంప్లెక్స్, టిన్ షెడ్లు, వ్రత మండపం, కాలక్షేప మండపం, ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణ మండపం, మహాప్రాకారం, రథశాల, జలప్రసాదం (డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు) ప్రతిపాదిత అభివృద్ధి పనులు చేప‌ట్ట‌నున్నారు.

*గోదావరి తీరం వద్ద నిర్మించబోయే సదుపాయాలు:

  1. పెద్ద డార్మిటరీ హాల్స్
  2. మహిళల కోసం డ్రెస్‌చేంజింగ్ రూములు
  3. సులభ్ కాంప్లెక్స్‌, షవర్స్‌, జలప్రసాద వసతి
  4. నిత్య అన్నదాన భవనం
    ఇవే కాకుండా మరిన్ని 14 పనులకు రూ.50 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు.