పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు..
పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు..
పరిశుభ్రమైన వాతావరణమే ఆరోగ్యానికి రక్షణ..
ఇంటి మాదిరిగానే కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలి :
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల్లో శనివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.
ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్ విభాగం, ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలు, సాయుధ బలగాల కార్యాలయాలు, మోటార్ వెహికల్ విభాగంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమగ్ర పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యాలయాలు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ విధులు నిర్వహించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా పనిచేసే ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పరిశుభ్రమైన వాతావరణం ద్వారా అనారోగ్య సమస్యలు, విషజ్వరాల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
