రాయలసీమలో పసిడి పంట..

స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరి

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం.. రెండో యూనిట్‌కు శంకుస్థాపన

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: బంగారు గనులంటే ఇప్పటివరకు కర్ణాటకలోని కేజీఎఫ్ పేరు గుర్తుకొచ్చేది. ఇకపై ఆ జాబితాలో కర్నూలు జిల్లా జొన్నగిరి పేరు కూడా చేరనుంది. ఒకప్పుడు కరవుకు ప్రతీకగా నిలిచిన రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారం ఉత్పత్తికి కేంద్రంగా మారబోతోంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలో రూపుదిద్దుకుంది.

జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించగా, తొలి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. దీనికి అనుగుణంగా అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రెండో దశలో మిగిలిన ప్రాంతంలోనూ విస్తరణ పనులు చేపట్టనున్నారు.

ప్రస్తుతం ఏర్పాటైన ప్లాంట్ ద్వారా తొలి ఏడాదిలో 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నారు. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వచ్చే ఏడాది 900 కిలోల బంగారం వెలికితీయనున్నారు. భవిష్యత్తులో ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసేలా ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. బంగారం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో అందనుంది. తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తి ద్వారా సుమారు రూ.57 కోట్లు, 900 కిలోల ఉత్పత్తి దశలో రూ.144 కోట్ల వరకు రాయల్టీ ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరే అవకాశం ఉంది.

ప్రారంభోత్సవం.. విస్తరణకు శంకుస్థాపన

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు రూ.405 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నిర్మించాయి. అవసరమైన నీటి కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి నుంచి 18 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా 0.021 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే గనిలో ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు జొన్నగిరికి చేరుకుంటారు. ఉదయం 11.45 గంటలకు గోల్డ్ మైనింగ్ ప్లాంట్ తొలి యూనిట్‌ను ప్రారంభించి, అనంతరం రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.