Govt Land | ప్రభుత్వ భూమిపై మరోసారి కబ్జా యత్నం..
హెచ్చరిక బోర్డు తొలగించి నిర్మాణ యత్నం.. చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ
Govt Land | ఆదిబట్ల, ఆంధ్రప్రభ: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూమి అనే తేడా లేకుండా కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగ్లూర్ రెవెన్యూ, సర్వే నంబర్ 11లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేపట్టేందుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో అధికారులు పనులను నిలిపివేశారు.
గతంలో ఇందిరమ్మ కాలనీలో 150 గజాల స్థలంలో తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేసి కాలనీవాసులకు మంచినీటి సరఫరా చేశారు. అనంతరం కాలనీలో కృష్ణా నీటి సరఫరా ప్రారంభం కావడంతో ఆ ట్యాంకులు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. అప్పటి నుంచి ఈ స్థలంపై కబ్జారాయుళ్ల దృష్టి పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాగునీటి ట్యాంకులను తొలగించి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా, అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆ నిర్మాణాన్ని తొలగించి, ఇది ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అనంతరం ఈ ప్రభుత్వ స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటి నంబర్‌తో పాటు విద్యుత్ మీటర్ కూడా పొందారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
మరోసారి కబ్జా యత్నం
గతంలో “ప్రభుత్వ భూమి” అని ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును జేసీబీతో తొలగించినట్లు స్థానికులు తెలిపారు. అప్పట్లో మున్సిపల్ అధికారులు కబ్జా యత్నాన్ని అడ్డుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోయారని అంటున్నారు. ఇప్పుడు అదే స్థలాన్ని మరోసారి కబ్జా చేసేందుకు యత్నించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారన్న సమాచారం అందిన వెంటనే పనులను నిలిపివేశామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూములు, వెంచర్లలోని పార్కు స్థలాలను కబ్జా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
