విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు

విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు
- కేసులు పెడుతున్నా.. కొత్త దారుల్లో అక్రమాలు
- డాక్యుమెంట్ రైటర్ల ద్వారా భారీగా సెటిల్మెంట్లు
- అనుమతి లేని భవనాలు, వివాదాస్పద భూములకు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు
- ఇప్పటికే విజిలెన్స్ తనిఖీల్లో అక్రమాల గుట్టు రట్టు
- అవినీతి నిర్ధారణ తర్వాతే రంగంలోకి ఏసీబీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఒక వైపు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా, మరోవైపు విజిలెన్స్, ఏసీబీ దాడులు జరుగుతున్నా సబ్ రిజిస్ట్రార్లు మాత్రం అదరకుండా, బెదరకుండా కొత్త తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు తమ విధానాన్ని మార్చుకుని డాక్యుమెంట్ రైటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిపిస్తూ ముడుపులు వసూలు చేస్తున్నారని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో సెటిల్మెంట్లు కూడా వారి ద్వారానే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వెలుగులోకి వస్తున్న అక్రమాలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాల వివరాలు విజిలెన్స్ తనిఖీలలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నల్గొండ జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల ఫోన్‌పే లావాదేవీలను తనిఖీ చేయగా అనేక అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి. అంతేకాకుండా, కక్షిదారుల వద్ద ఉండాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా వారి వద్దే ఉన్నట్లు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలోని మరో కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల మధ్యవర్తిత్వంతో అనుమతి లేని భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, మరో 12 ఆడిట్ జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. కొన్ని కార్యాలయాల్లో పూర్తి స్థాయి సబ్ రిజిస్ట్రార్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు.
ప్రతి కార్యాలయానికి ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూములకు అధిక డిమాండ్ ఉండటంతో, దీనిని అవకాశంగా మార్చుకుని కొందరు సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా సెటిల్మెంట్లు చేసుకుంటూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
అనుమతి లేని భవనాలకూ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో భూములకు అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు, వివాదాస్పద భూములకు కూడా దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలలో ఈ తరహా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తరువాత ఏసీబీ బృందాలు రంగంలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.
