డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హనుమకొండలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభం
యువత క్రీడల వైపు మళ్లితేనే మత్తు వ్యసనాలకు చెక్
హనుమకొండ (ఆంధ్రప్రభ): మత్తు పదార్థాల నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చి డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ రహిత భారత్ సాధనకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలో నిర్వహించిన “నషా ముక్త్ భారత్ అభియాన్ – డ్రగ్స్ రహిత తెలంగాణ” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించి, కలెక్టరేట్ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు.
గవర్నర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన “నషా ముక్త్ భారత్ అభియాన్” సామాజిక చైతన్య ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. మత్తు రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి బాధ్యత అని స్పష్టం చేశారు. “మా ఇంట్లో మత్తు పదార్థాలకు చోటు లేదు” అనే సంకల్పాన్ని ప్రతి కుటుంబం తీసుకుంటే సమాజంలో గొప్ప మార్పు వస్తుందని అన్నారు. ముందుగా తాము మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అదే దిశగా నడిపించాలని సూచించారు.
యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. “ఆటలు ఆడించండి… మత్తును పారదోలండి” అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని సూచించారు. తాను గవర్నర్‌గా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, తెలంగాణలోనూ ప్రతి జిల్లాలో ఈ ఉద్యమాన్ని విస్తరించాలని ఆకాంక్షించారు. తెలంగాణను మత్తు రహిత రాష్ట్రంగా, భారత్‌ను మత్తు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ప్రజల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ నిర్మూలన
రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా “నషా ముక్త్ భారత్ అభియాన్” విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
