పొగాకుకు దూరంగా ఉండండి..

పొగాకుకు దూరంగా ఉండండి..

  • ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ
  • జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కే .రవికుమార్

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని, ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె. రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాగర్‌కర్నూల్ పాత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్వహించిన అవగాహన ర్యాలీని డాక్టర్ కె. రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్లు, బీడీలు, తంబాకు, గుట్కా, ఖైనీ, జర్దా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోరు, గొంతు, ఊపిరితిత్తులు, ఆహారనాళం వంటి అవయవాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతం, మధుమేహం తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

చిన్న వయసులో సరదాగా ప్రారంభమయ్యే పొగాకు అలవాటు క్రమంగా వ్యసనంగా మారి యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం (కోట్పా–2003) ప్రకారం 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధమని తెలిపారు. అలాగే విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేయరాదని, బస్టాండ్లు, వ్యాపార సముదాయాలు, సినిమా థియేటర్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రామకృష్ణ, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ ప్రదీప్, వైద్యాధికారులు డాక్టర్ వాణి, డాక్టర్ సృజన, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, డీపీఓ రేనయ్య, ఎన్‌సీడీ కోఆర్డినేటర్లు విజయ్‌కుమార్, మల్లేష్, పర్యవేక్షణ సిబ్బంది సుకుమార్ రెడ్డి, కోట్ర నిరంజన్, విజయ్, ఎంఎల్‌హెచ్‌పీలు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ మణికంఠ, ఫార్మసీ అధికారులు సురేష్‌కుమార్, కుమార్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply