కృష్ణా డెల్టాకు పట్టిసీమతో ఊపిరి

పోలవరం పూర్తయ్యే వరకు గోదావరి జలాల వినియోగమే లక్ష్యం
సూపర్ ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
పట్టిసీమపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్య

ఏలూరు జిల్లా-పట్టిసీమ బ్యూరో, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వృథా జలాలను కృష్ణా డెల్టాకు తరలించాలన్న లక్ష్యంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఆశించిన ఫలితాలను అందించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టిసీమ ద్వారా సాగునీరు అందించి వేల కోట్ల రూపాయల విలువైన పంటలను కాపాడగలిగామని చెప్పారు. బుధవారం ఏలూరు జిల్లా పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి ఎత్తిపోతల పథకాల వద్ద మోటార్లను ప్రారంభించి నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరికి జలహారతి ఇచ్చిన మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. గతంలో పట్టిసీమను విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా డెల్టాకు తరలించి సుమారు రూ.50 వేల కోట్ల వ్యవసాయ ఆదాయం సాధించామని తెలిపారు.

దూరదృష్టి, ముందుచూపు ఉన్న నాయకత్వానికి పట్టిసీమ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. పాలనలో అనుభవలేమి, విధ్వంసక ఆలోచనల కారణంగానే గత ప్రభుత్వ హయాంలో పట్టిసీమకు ప్రాధాన్యం దక్కలేదని విమర్శించారు. ప్రస్తుతం ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న తరుణంలో కృష్ణా డెల్టాకు పట్టిసీమే ఊపిరిగా మారిందని అన్నారు.

సూపర్ ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొంటాం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో సూపర్ ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే చర్యలు చేపట్టామని చెప్పారు. అతివృష్టి, అనావృష్టి ప్రాంతాల్లో కాలువలు, డ్రైన్లను సమీప చెరువులతో అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో ‘జలధార–జలహారతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా భూమినే జలాశయంగా మార్చి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భూగర్భ జలమట్టం ఒక మీటరు పెరిగితే 99 టీఎంసీల నీరు లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. సమర్థ నీటి యాజమాన్యంతో నీటి పొదుపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

70 ఏళ్ల చరిత్రలో జూలై 5 నాటికి గోదావరికి ఇన్‌ఫ్లోలు లేకపోవడం ఇదే తొలిసారని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వస్తున్న నీటిలో రోజుకు 8,000 క్యూసెక్కులను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని చెప్పారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇచ్చి, అనంతరం సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు. రైతులు కూడా ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇచ్చి నీటి పొదుపులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జే. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఆర్డీవో ఎం.వి. రమణ, ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాల సునీల్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.