Bapatla | థ్యాంక్యూ.. కలెక్టర్..

Bapatla | థ్యాంక్యూ.. కలెక్టర్..
Bapatla, బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ (Collector) ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వస్తున్న అర్జీదారులకు ఉచిత భోజన పథకం నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్వాహకులు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నారాయణ భట్టును భోజన మోతాదు పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎక్కడ నుండి సరఫరా అవుతుందని అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి అక్షయ ఫౌండేషన్ ద్వారా వస్తుందని జిల్లా కలెక్టర్ కు రెడ్ క్రాస్ సభ్యులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్.. భోజనం చేస్తున్న అర్జీదారులను భోజనం రుచిగా ఉందా అంటూ అడిగారు. బియ్యం ఏ రకం వాడుతున్నారు..? మీ ఇంట్లో కూడా ఇదే ఈ రకమైన బియ్యం ఉంటుందా..? అని ఆరా తీశారు. వారు మా ఇంటిలో మాదిరిగానే సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారని భోజనం అద్భుతంగా ఉందని కలెక్టర్ కు తెలిపారు. గతంలో పిజిఆర్ఎస్ కు వచ్చి ఖాళీ కడుపుతో ఇళ్లకు వెళ్లే వారమని.. కూటమి (Kutami) ప్రభుత్వంలో కడుపునిండా భోజన వసతి కల్పిస్తున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల వద్ద నుండి మంచి అభిప్రాయం రావడంతో కలెక్టర్ నిర్వాహకులను ఓకే వెల్ & గుడ్ అని ప్రశంసించి తిరిగి పిజిఆర్ఎస్ కు వెళ్లారు.
