ప్లాస్టిక్కు చెక్… స్వచ్ఛ నంద్యాలకై వినూత్న కార్యక్రమం..
ప్లాస్టిక్కు చెక్… స్వచ్ఛ నంద్యాలకై వినూత్న కార్యక్రమం..
1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే… చక్కెర, సేమియా, గుడ్ల బహుమతి…
రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవు.. జిల్లా కలెక్టర్ మంత్రి హెచ్చరిక.
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వచ్ఛత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని గాంధీచౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ స్వయంగా పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పరిశుభ్రత, పచ్చదనంలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపారులు చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలని సూచించారు. “స్వచ్ఛఆంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి ఇంటి బాధ్యతగా భావించాలని, ప్రజల సహకారం లేకుండా ఏ కార్యక్రమమూ విజయవంతం కాదు” అని మంత్రి పిలుపునిచ్చారు.
ప్లాస్టిక్ ఇస్తే… నిత్యావసరాల బహుమతి..
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు వినూత్నంగా ఏర్పాటు చేసిన “వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి కేంద్రం”ను మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లను కాల్చడం, ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోందని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ప్రజలు 1 కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే 1 కిలో చక్కెర లేదా 1 కిలో బాంబినో సేమియా లేదా 6 కోడి గుడ్లను ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పట్టణ ప్రజలకు మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా చక్కెర, సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు.
చెత్త పారబోసేవారిపై కఠిన చర్యలు…
వ్యాపారులు రాత్రివేళల్లో దుకాణాల చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల కాలువలుమూసుకుపోయి
పట్టణంకలుషితమవుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి హానికరంగా మారుతున్న ఈ పరిస్థితులను నివారించేందుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి, ట్రాఫిక్ మరియు సివిల్ పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, కాగితం వంటి వ్యర్థాలను సేకరించే పేదలకు ఇది ఉపాధి అవకాశంగా మారుతుందని, వారు సేకరించిన వ్యర్థాలను అందజేస్తే ఉపాధితో పాటు పోషకాహార పదార్థాలు కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు…..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రతి గ్రామం, ప్రతి వార్డును పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర” కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
