చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలి రాజ్
అభినందించిన బాబు, లోకేశ్
అమరావతి: ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి, మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజయం సాధించిన సంతోషాన్ని పంచుకున్నారు.

సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న శ్రీచరణి, మిథాలి రాజ్‌లకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ విజయం సాధించినందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందించారు. భారత మహిళలు ప్రపంచ వేదికపై తమ సత్తాను నిరూపించారని, క్రీడల్లో మహిళలకు ఇది గొప్ప స్పూర్తి అని సీఎం సందేశమిచ్చారు.

ఇదిలా ఉండగా, గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, తదితరులు ఆమెకు పలకరించారు.

ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్‌తో కలిసి శ్రీచరణి, మిథాలి రాజ్‌లు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. భారత మహిళల క్రీడా ప్రతిభ ప్రపంచాన్ని మరోసారి ఆకట్టుకుంది.





