శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 20వ వార్షిక త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఆదివారం ఉదయం స్వామివారి నిత్యపూజ, మంటప ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురారోపణం, ఋత్విక్ వర్ణం, బేరి పూజ, ధ్వజపటాధివాసం, ధ్వజారోహణం (సంతానం కోసం ఎదురుచూసే వారితో గరుడ పూజ), యాగశాల ప్రవేశం, తోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, సర్వవైదిక హోమం, లఘు పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు.

ఈ నెల 27 సోమవారం ఉదయం 6 గంటలకు స్వామివారి పంచామృత అభిషేకం, ఉదయం 8 గంటలకు మంగళసూత్రం ఎదురుకోవడం, ఉదయం 9 గంటల నుండి శ్రీవారి కల్యాణోత్సవం, స్థాలిపాక హోమం, లఘు పూర్ణాహుతి అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు రథ హోమం అనంతరం రథోత్సవం నిర్వహించనున్నారు.

ఈ నెల 28 మంగళవారం ఉదయం 6 గంటలకు నిత్యపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, మంటప ఆరాధన, స్థాపిత దేవత హోమం, శ్రీనివాస హోమం, మహా పూర్ణాహుతి, ఆలయ బలిహరణం, కుంభ ఉద్వాసన, మహా కుంభప్రోక్షణ, తీర్థ గోష్టి నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ద్వాదశ ఆరాధన (నాగవెల్లి), పుష్పయాగం, ఊంజల సేవ, వేద ఆశీర్వచనం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పూజా కార్యక్రమాలు వైదికులు శ్రీమాన్ నేరళ్ళ నరసింహమూర్తి కౌండిన్య, శ్రీమాన్ నేరళ్ళ సందీప్ ఆచార్య కౌండిన్య ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని తెలిపారు.

Leave a Reply