వేగ నియంత్రకాలు లేక ప్రమాదాల పరంపర..
ప్రాణాలు బలితీసుకుంటున్న కూడలి
శావల్యాపురం, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద వేగ నియంత్రకాలు (స్పీడ్ బ్రేకర్లు) లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల ప్రాణనష్టంతో పాటు పలువురు వాహనదారులు అంగవైకల్యాల బారిన పడుతున్నారు. రోడ్డు భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శావల్యాపురం నుంచి కారుమంచి, వయ్యకల్లు, గుంటుపాలెం, భాస్కర్‌నగర్‌తో పాటు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామాలకు వెళ్లే రహదారులు కలిసే నాలుగు రోడ్ల కూడలి వద్ద నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ జంక్షన్‌కు సమీపంలోనే వైన్ షాప్ ఉండటంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు అధిక వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
ఇటీవల ఈ కూడలి వద్ద పలుమార్లు ప్రమాదాలు సంభవించగా, గతంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా చోటుచేసుకుంది.
నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ నాలుగు రోడ్ల కూడలి వద్ద వెంటనే వేగ నియంత్రకాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
