ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ..
తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, మాతా–శిశు సంరక్షణలో భాగంగా పిల్లల జననాల మధ్య తగిన విరామం పాటించాలని సూచించారు. దీంతో తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కుటుంబ సంక్షేమం కూడా మెరుగుపడుతుందని తెలిపారు.
పిల్లల మధ్య సరైన విరామం ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా ఉంటూ, పిల్లల సంరక్షణకు తగిన సమయం కేటాయించగలరని వివరించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అలవాల విజయ్ కుమార్, సుగుణాకర్ రాజు, జ్వలిత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
