భక్తజన కోలాహలం..
- కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌తో అమ్మవారి విశేష అలంకరణ
- బోనాలతో తరలివచ్చిన భక్తులు..
- 50 కిలోల కదంబం ప్రసాదం పంపిణీ..
- ఘనంగా ఆషాఢ మాస వేడుకలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా
- ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ కమిటీ
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ బస్టాండ్ సమీపంలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం శాకంబరీ దేవి అలంకారంలో శ్రీ కాళీమాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో కొలువైన శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని బోనాలు సమర్పించారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు సమర్పించిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో రూపొందించిన కార్వింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వినాయకుడు, కంగారు, మొసలి, రామచిలకలు, బాతులు, పుష్పగుచ్ఛాలు తదితర ఆకృతులను కూరగాయలతో కళాత్మకంగా రూపొందించడంతో భక్తులు వాటిని ఆసక్తిగా తిలకించారు. ఆలయ ఆధ్యాత్మిక సలహాదారు బీహెచ్ విజయకిరణ్ ఆధ్వర్యంలో 50 కిలోల కదంబం ప్రసాదాన్ని సిద్ధం చేసి భక్తులకు పంపిణీ చేశారు.

శాకంబరీ దేవి అలంకారాన్ని, ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక అలంకరణలను భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జి. పుల్లయ్య, సెక్రటరీ జగదీష్ కుమార్, కమిటీ సభ్యులు జి. సత్యనారాయణ, జగన్, రాజా, విజయ్, మల్లేశ్వరరావు, పరమేశ్వరరావు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
