ఘనంగా యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవం

  • బైక్ ర్యాలీ.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం పట్టణంలో యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూరు రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దూరు రవికిరణ్ మాట్లాడుతూ దేశానికి యువతే భావిభారత నిర్మాతలని, యువత శక్తిని దేశ అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సువర్ణ భారతదేశ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి దిశానిర్దేశం చేసేలా యువత ముందుకు సాగాలని, దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల స్ఫూర్తితో ప్రజా సేవలో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి తోటపల్లి కుమార్, మండల ఇన్‌చార్జి జానీ, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు చె.నీరజ్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.