ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి

మునుగోడు, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి ఎస్‌.పద్మజ సూచించారు.

ఆదివారం గుడాపూర్‌ గ్రామంలో పత్తి, ఖాళీ పొలాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెసర, మినుము, జొన్న, నువ్వులు, సజ్జలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

పొలాల గట్ల వెంట కంది, వేప, కానుగ వంటి చెట్లను పెంచాలని సూచించారు. వర్షపు నీటిని కందకాల ద్వారా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. మోతాదుకు మించి ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు వినియోగించకుండా భూసారాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నన్నూరి భూపతిరెడ్డి, ఏఈఓ మాధగోని నర్సింహగౌడ్‌, రైతులు దేశిడి వెంకన్న, దర్శనం రాములు, అక్కినపల్లి లింగస్వామి, దేశిడి చిన్న వెంకన్న, సొల్లేటి అంజయ్య, నన్నూరి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.