కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు..
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి అండగా బీఆర్‌ఎస్ నేతలు
దండేపల్లి, ఆంధ్రప్రభ: షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల సతీష్ కేటీఆర్ చొరవతో ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. సతీష్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్ ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్.. సతీష్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్‌లో ఉన్న సతీష్ స్వదేశానికి చేరుకునేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఆదివారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. అనంతరం కుటుంబ అవసరాల కోసం కేటీఆర్ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. సతీష్ క్షేమంగా స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమైంది. ఆపద సమయంలో స్పందించి అండగా నిలిచిన కేటీఆర్, నడిపెల్లి విజిత్‌కుమార్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
