వరంగల్ నుంచే నా ప్రస్థానం ప్రారంభమైంది: డీజీపీ సీవీ ఆనంద్
- ట్రైనీ ఐపీఎస్‌గా ఇక్కడే పనిచేశా..
- నక్సల్స్ ప్రభావం నాటి రోజులు వేరు
వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో : వరంగల్ నుంచే తన పోలీస్ ప్రస్థానం ప్రారంభమైందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఇక్కడే తన కెరీర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివారం హనుమకొండలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్‌లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.
ఆ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవని డీజీపీ తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి వస్తామా లేదా అన్న అనుమానం ఉండేంతగా నక్సల్స్ ప్రభావం ఉండేదన్నారు. అయితే 2010 తర్వాత రాష్ట్రంలో మావోయిజం ప్రభావం గణనీయంగా తగ్గిందని చెప్పారు.
చుట్టుపక్కల రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాల్లో ప్రభావం ఉన్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో మావోయిస్టు క్యాడర్ లొంగిపోయిందని, ప్రస్తుతం మావోయిజం పెద్దగా ప్రభావం చూపడం లేదని డీజీపీ పేర్కొన్నారు. సోమవారం ములుగులో లొంగిపోయిన మావోయిస్టులు, మావోయిజం బాధితులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు, బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ యాప్ ద్వారా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. 1992 నుంచి 1996 మధ్య మరణించిన వారి కుటుంబాలకు అందిన ఎక్స్‌గ్రేషియా తక్కువగా ఉందన్న అంశం కూడా తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం డ్రగ్స్ సమస్య ప్రధాన సవాల్‌గా మారిందని డీజీపీ అన్నారు. నార్కోటిక్ బ్యూరో, ట్రాఫిక్, సీఐడీ విభాగాలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
