చంద్రబాబు నాయకత్వంలోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యం
- చివరి గిరిజన గూడెం వరకు అభివృద్ధే స్వర్ణాంధ్ర లక్ష్యం
- విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆదివాసీలు కేవలం అడవుల్లో నివసించే ప్రజలు కాదని, నేల, నీరు, ప్రకృతితో వేల ఏళ్లుగా అనుబంధం కలిగిన మూలవాసుల వారసులని చిన్ని పేర్కొన్నారు. వారి చరిత్ర భారతదేశ చరిత్రకు ముందుమాట వంటిదన్నారు. ప్రకృతిని జయించకుండా, దానితో సహజీవనం చేస్తూ జీవించిన గొప్ప సంస్కృతి ఆదివాసీలదని కొనియాడారు.
గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి సామాజిక న్యాయానికి నిదర్శనం

ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ద్వారా గిరిజన సమాజానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యున్నత గౌరవం కల్పించిందని కేశినేని చిన్ని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల చూపుతున్న గౌరవానికి ఇది నిదర్శనమన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు, పథకాలు అందిస్తుండగా.. చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటోందని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. గిరిజన రైతులు పండించే ఉత్పత్తులకు దేశ, విదేశీ మార్కెట్లలో గుర్తింపు లభించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అరకు కాఫీని కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు పరిచయం చేస్తూ గిరిజనుల శ్రమకు తగిన మార్కెట్ కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 13 వేల మంది గిరిజన మహిళలతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం ద్వారా ఆదివాసీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు.
గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలు చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చిన్ని తెలిపారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఆదివాసీ, గిరిజన యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
గిరిజన విద్యకు 29.28 శాతం నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. విద్యే గిరిజన సమాజ అభివృద్ధికి అత్యంత శక్తివంతమైన సాధనమని, విద్యా అవకాశాలు పెరిగితే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తు అందుతుందని అన్నారు.
తిరువూరు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని చిన్ని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం గిరిజనుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమన్నారు.
చివరి గూడెం వరకు అభివృద్ధి
నగరాల అభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధి కాదని, కొండల్లో, అడవుల్లో, మారుమూల గిరిజన గూడేల్లో నివసించే చివరి కుటుంబం వరకు అభివృద్ధి చేరినప్పుడే అది సార్థకమవుతుందని కేశినేని చిన్ని అన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను పరిరక్షిస్తూ విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాధి, మౌలిక వసతులను గిరిజనుల గడపకు చేర్చడమే స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలకమని తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో ఆదివాసీ, గిరిజన సమాజం అభివృద్ధి, ఆత్మగౌరవం, ఆత్మనిర్భరత వైపు మరింత ముందుకు సాగుతుందని కేశినేని చిన్ని ఆకాంక్షించారు. ఆదివాసీల అభ్యున్నతి ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
