తిరుమల, కాణిపాకంలో ప్రత్యేక పూజలు..
- నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పూజలు
- ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్ష
- అభివృద్ధి పనులు విజయవంతం కావాలని స్వామివార్లకు వేడుకోలు
(తిరువూరు, ఆంధ్రప్రభ) : తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం తిరుమల శ్రీవారిని, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనంతరం కాణిపాకం చేరుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దైవాశీస్సులు పొందారు.

తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తికావాలని, ప్రతి గ్రామం మరింత అభివృద్ధి సాధించాలని స్వామివార్లను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారమై ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శ్రీవారి కృప, వరసిద్ధి వినాయకుని అనుగ్రహంతో తిరువూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
