గ్రోత్ మానిటరింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. షాజిదా

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: గ్రోత్ మానిటరింగ్ ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. షాజిదా అన్నారు. ఉరవకొండ ప్రాజెక్టు పరిధిలోని నింబగల్లులోని 2, 3 అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రోత్ మానిటరింగ్ నిర్వహణను పరిశీలించారు. కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు నమోదులను ర్యాండమ్‌గా తనిఖీ చేసి, పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని, తల్లిపాల ప్రాధాన్యతపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వడం, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అరుణ, విజయ, పుష్పా, హసీనా, డీపీఏ సాహినా, బీపీఏ కల్పన, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.