కరువు జిల్లాలో బిందు సేద్య పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం…
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్
ఉరవకొండ రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): కరవుకు చిరునామాగా నిలిచిన అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సిన సామూహిక బిందు సేద్య పథకాలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని, పథకాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో, రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి. జగదీష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలం లోని ఆమిద్యాల గ్రామం వద్ద తుప్పుపట్టి నిరుపయోగంగా పడి ఉన్న బిందు సేద్య పరికరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ–నీవా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుల పరిధిలో కాలువల ద్వారా సాగునీరు అందని ఎత్తైన ప్రాంతాలకు, పైపులైన్‌ల ద్వారా నీటిని చేరవేసేందుకు రూ.899.20 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు సామూహిక బిందు సేద్య పథకాలను 2017లో ప్రారంభించారన్నారు.
ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ, కూడేరు, బెలుగుప్ప మండలాల పరిధిలోని 23 గ్రామాల్లో 49,918 ఎకరాలకు సాగునీరు అందించడమే, ఈ పథకాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పనులు దాదాపు 25 శాతం పూర్తయ్యాక 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన పనులను పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కొను గోలు చేసిన పైపులు, పంపులు, ఇతర పరికరాలు ఆమిద్యాల వద్ద ఎండవాన లకు గురై తుప్పుపట్టి, పడేపోతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణ పనులు కూడా శిథిలావస్థకు చేరుకుంటుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం తో జిల్లా మరోసారి తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ, రైతులకు శాశ్వత సాగునీటి భరోసా కల్పించే, ఈ పథకాలను పక్కన పెట్టడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా ప్రజాప్రయోజనాల కోసం ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించడం ప్రభుత్వ బాధ్యతేనని, కరవు జిల్లాలో సాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేయడం రైతాంగానికి తీరని అన్యాయమని మండిపడ్డారు. రూ.899 కోట్లతో ప్రారంభించిన, ఈ పథకాలను వెంటనే పునఃప్రారంభించి, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపది కన పూర్తి చేసి, 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే రైతాంగంతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాగునీరు రైతుల హక్కు అని, ఆ హక్కు సాధన కోసం రైతులు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, మల్లికార్జున, ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి సుల్తాన్, నాగేంద్ర, బసవరాజు, సూరి, అసేన్ భాష తదితరులు పాల్గొన్నారు.
