అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థుల ప్రతిభ

థాయ్‌లాండ్‌లో జరిగిన పోటీల్లో మూడు పతకాలు
విజేతలకు ఘన స్వాగతం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : థాయ్‌లాండ్‌లోని పట్టాయ నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లికి చెందిన విద్యార్థులు పలు పతకాలు సాధించారు. గత నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ప్రపంచ తైక్వాండో సమాఖ్య ఆధ్వర్యంలో నైన్త్ హీరోస్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి.

ఈ పోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ ప్రధాన్ రజత పతకం, లాస్య దలాయ్ కాంస్య పతకం, గోగర్ల శ్రీనిత్ సాయి కాంస్య పతకం సాధించినట్లు తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సాంకేతిక కమిటీ చైర్మన్ మాస్టర్ జిల్లపల్లి వెంకటస్వామి తెలిపారు.

పోటీల అనంతరం శుక్రవారం ఎక్స్‌ప్రెస్ రైలులో బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.

విజేతలకు శిక్షణ ఇచ్చిన జంగపెళ్లి అజయ్‌ను తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు మూట శ్రీనివాస్, కార్యదర్శి కురువ శ్రీహరి, కోశాధికారి సంతోష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బుచ్చి రామారావు, కార్యదర్శి జిల్లపల్లి వెంకటస్వామి, కోశాధికారి సుధాకర్ ప్రత్యేకంగా అభినందించారు.